
వనపర్తి, వెలుగు: వనపర్తి హెడ్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లో సేవలు అందక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని రైలు ప్రయాణికుల కోసం పదేండ్ల కింద పట్టణంలోని హెడ్ పోస్టాఫీసులో రైల్వే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. మదనాపురంలో స్వాతంత్ర్యానికి ముందు సంస్థానాధీశుల కాలంలో వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజలు తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, కర్నూల్, రేణిగుంట, రాయచూరు తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ స్టేషన్ నుంచే రాకపోకలు సాగిస్తారు.
ఈ స్టేషన్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో వనపర్తి హెడ్ పోస్టాఫీసులో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. కరోనా తరువాత ఈ కౌంటర్ లో రిజర్వేషన్ సేవలు అందడం లేదు. రిజర్వేషన్ కోసం పోస్టాఫీసుకు వెళ్లిన వారు అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి వస్తున్నారు. అయితే కౌంటర్ ఉందా? ఎత్తేశారా? అనే విషయాన్ని సంబంధిత అధికారులు స్పష్టం చేయడం లేదు. దీంతో కొందరు ఆన్లైన్లో రిజర్వేషన్లు చేసుకుంటుండగా, మరికొందరు వనపర్తి రోడ్, గద్వాల రైల్వే స్టేషన్లకు వెళ్లి రిజర్వేషన్ చేసుకుంటున్నారు.